సంగారెడ్డి, మార్చి 13,(రుద్ర ప్రతినిధి): ఏదైనా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు స్వీయ రక్షణతో పాటు తోటి పౌరులను రక్షించడం కోసం వారం రోజుల శిక్షణా తరగతులను గీతం విద్యార్థులకు అందజేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకుని గొప్ప స్వచ్ఛంద సేవకులుగా ఎదగాలని సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీ బి. నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర & పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల 'పౌర రక్షణ స్వచ్చంద శిక్షణ సామర్థ్య నిర్మాణం' కార్యక్రమాన్ని గురువారం (12-3-2026న) హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మతో కలిసి, నాగేశ్వరరావు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులకు (విద్యార్థులకు) అగ్నిప్రమాదాలు, విమాన, రసాయన, అణు విస్ఫోటనం, వరదలు, భవన సముదాయాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా ప్రతిస్పందించాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు, అలాగే, వైద్య సిబ్బంది సహకారంతో, క్షతగాత్రులకు ప్రథమ చికిత్సతో పాటు సీపీఆర్ ప్రక్రియ, స్ట్రెచ్చర్లపై తరలింపు వంటి వాటిపై కూడా తర్ఫీదు ఇస్తున్నారు. వీటితోపాటు, జన సమూహాన్ని అదుపు చేయడం, విపత్తు సమయంలో ప్రజలకు ఔషధాలు, ఆహార పంపిణీ వంటి వాటిపై కూడా శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమం వారం రోజులపాటు (ఈనెల 18వ తేదీ వరకు) కొనసాగనుంది. ఈ శిక్షణలో భాగంగా, తొలిరోజు పటాన్ చెరు అగ్నిమాపక శాఖాధికారి కె.వి.నాగేంద్ర విద్యార్థులకు అగ్నిమాపక పరికరాల వినియోగం, అనుకోకుండా ఏదైనా మంటలు చెలరేగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు గురించి విద్యార్థులకు వివరించారు. ఈ శిక్షణలో కార్యక్రమ ప్రారంభోత్సవంలో సంగారెడ్డి అగ్నిమాపకాధికారి ఎస్. భిక్షపతి, ఇతర అధికారులు, పలువురు సిబ్బంది, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, డాక్టర్ పాత్రుడు, ఎస్టేట్ అధికారులు డీవీఏ మోహన్, ఎం. సతీష్, భద్రతాధికారి కె. సంతోష్ కుమార్ యాదవ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



0 Comments